ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 6:16 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

శాంతియుత పోరాటాల ద్వారా సామాజిక మార్పు సాధించడమే గాంధీజీ ఆశయం: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

అర్జున్ సమాచారం:
మహాత్మాగాంధీ అనుసరించిన ప్రజాస్వామిక శాంతియుత పోరాట కార్యాచరణ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తనకు స్ఫూర్తిగా నిలిచిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ప్రజాస్వామిక హక్కుల సాధనకోసం గాంధీజీ అనుసరించిన సత్యాగ్రహ పంథా నేటి యువతరానికీ ఆచరణీయమన్నారు. గాంధీ జయంతి సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం వారి త్యాగనిరతని స్మరించుకుంటూ ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు.
న్యాయమైన ప్రజల ఆకాంక్షల కోసం, నిరంకుశ ప్రభుత్వాల మీద పోరాడే నాయకత్వం, విశాల దృక్పథంతో తమ పోరాట కార్యాచరణను రూపొందించుకోవాలనే తాత్వికతను గాంధీజీ జీవితం నుంచి నేర్చుకోవాల్సి ఉన్నదని కేసీఆర్ అన్నారు. పీడితులందరినీ సమన్వయం చేసుకుంటూ, భావజాల వ్యాప్తిని చేస్తూ, శాంతియుత పోరాటంలో భిన్న వర్గాలను ఐక్యసంఘటన శక్తిగా తీర్చిదిద్దుకోవాలనే గాంధీజీ ఆశయాలను ప్రతీ ఒక్కరు అనుసరించాలన్నారు. తెలంగాణ సాధన కోసం తాను ఒంటరిగా ముందడుగు వేసిన నాటినుంచి నేటి వరకు ఎన్ని కష్టాలొచ్చినా తాను స్థిత ప్రజ్జతతో అనుసరిస్తున్న కార్యాచరణలో గాంధీజీ స్పూర్తి ఇమిడి ఉన్నదని కేసీఆర్ స్పష్టం చేశారు. విద్వేష పూరిత ప్రసంగాలను, కక్షపూరిత వైఖరులను విడనాడి, ప్రజల నడుమ శాంతి సౌభ్రాతృత్వం పరిఢవిల్లేలా పాలనను కొనసాగించడం ద్వారా మాత్రమే జాతిపిత మహాత్మాగాంధీకి మనం నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
=================